పునుగుపిల్లి.

పునుగుపిల్లి అంటే ,తిరుమల శ్రీవారికి వాడే సుగంధద్రవ్యాలకు, దానికి ఏదో సంబంధం ఉందని ఎక్కడో చదివిన గుర్తు ,అంతేకానీ ,దాన్నెపుడూ చూడలేదు,వివరాలేమీ తెలియవు.భీమవరంలో ఉన్న మా కజిన్ వాళ్ళంటికి ,రోజూ రాత్రి వస్తుందట!  దాని కోసమే వీళ్ళు రోజూ అరటిపండు ,పాలు, పెడతారు ,చక్కగా తినేసి,తాగేసి వెడుతుందదట!  మామూలు పిల్లిలా కాదు ,ఇది శాకాహారి అనుకున్నా .అటువంటి పునుగుపిల్లి మా దొడ్లోకీ వస్తుంది ,మేము కూడా చూసేసాం ,అదన్నమాట సంగతి.
తెల్లవారు ఝామున దొడ్లో ఉన్న బోప్పాయిచెట్టు మీద చూసాను.కాయ తెంపుకొని,ఆపళంగానే గుజ్జుఅంతా తినేసి ,తొక్క క్రింద పడేసి పోతాయి .మేము ఉండేది తాతలనాటి పెంకుటిల్లు. అటకులు ఉంటాయి .ఈ మధ్య అటకమీద చప్పుళ్ళు,అరుపులు వినపడుతుంటే,పిల్లి పిల్లల్ని పెట్టి ఉంటుంది లే!అది మామూలే కదా అనుకున్నా ! ఒకరోజు ఉదయాన్నే ,గదులన్నీ ఊడుస్తూ, స్టోర్ రూం లోకి  వెళ్ళే సరికి ,పాపం క్రింద పడిఉంది పునుగుపిల్లి పిల్ల భాధగా అరుస్తూ .మొదటిసారి అంత దగ్గరగా చూడటం.ముట్టుకోవడానికి భయమేసింది ముట్టుకుంటే అదేమన్నా చేస్తుందేమోనన్న అనుమానం,హఠాత్తుగా పైనుంచి తల్లి  దూకుతందేమోనన్న భయంతో వెనక్కి వచ్చేసాను.ఏంచేయాలో తోచలేదు. అలాగే ఉంచేస్తే అది ఇంట్లో ఏమైనా అయిపోతుదన్న వెధవ అనుమానం .
ఈలోపు శ్రీ వారు  వచ్చి , దాన్ని జాగ్రత్తగా అట్టపెట్టె లోకి లాగి , బైటకు తీసికొచ్చారు . పాపం ! మేం దాన్ని కదిపి బైటకు తెచ్చేసరికి అరవడం కూడా మానేసింది.దాన్ని చూడకుడానే ,వాసన పసికట్టి , మా కేండీ అరుపులు ,హడావుడీనూ! ఇక దాన్నేం చేయాలో అర్ధం కాలేదు . ముందుగా కాసిని  నీళ్ళు పోద్దామని ,దాన్ని ,వాడకంలో లేని నీళ్ళ కుండీలో పెట్టాం,కేండీకి అందకుడా.తరువాత చెంచాతో నీళ్ళు పోసాను.త్రాగలేదు,ప్రక్కనుండి వచ్చేసాయి.పాలు పోస్తే ,చక్కగా చప్పరిస్తూ  తాగేసింది. కథ ఇంకా చాలా ఉందండోయ్! మిగతా మరోసారి .