'మా ఊరు' కు వచ్చేసాం.

అవునండీ! మేము  హైదరాబాద్ నుండి మా ఊరికి  వచ్చేసాం.నేను బ్లాగు మొదలు పెట్టిన కొత్త లో ,అంటే గత మే నెలలో 'మా ఊరు ' అని టపా పెడితే బోలెడన్ని వ్యాఖ్యలు వచ్చాయి .స్వఛ్ఛందంగా పదవీవరమణ తీసుకున్న మా వారికి ,సొంత ఊరిలో స్థిరపడాలని కోరిక .అందుకే హైదరాబాద్  నుండి ,పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్న మా ఊరు 'ఉండి' వచ్చేసాం. ఇక్కడికి వచ్చి సరిగ్గా  నెల ఈ రోజుకి.18 సంవత్సరాలు గా ఉన్న హైదరాబాద్ ను వదిలి రావడానికి నాకైతే కొంచెం కష్టంగా నే అనిపించింది అక్కడ ఉన్న సొంత ఇంటిని వదలి రావడం ఇంకొంచెం బాధ .ఇక్కడ అంతకన్నా మంచి ఇల్లు కట్టుకోబోతున్నాము,అయినా ఏదో వెలితి గా అన్పిస్తుంది,ఎందుకో మరి?తొందర్లోనే సర్దుకు పోతానులెండి.ప్రతీ విషయంలో రెండు కోణాలుంటాయి, అంటారు కదా ! ఇప్పుడు  మా విషయంలో కూడా అంతేనండీ! ఒక అబ్బాయి  అమెరికా లో ఉంటూ ,ఎట్లాగూ దూరంగా నే ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్న ఇంకొక అబ్బాయి  ని వదిలి వెళ్ళడమెందుకని నా ఉద్దేశం .కానీ మా వారి ఇష్టప్రకారమే వచ్చేసామనుకోండి. 60 సంవత్సరాలు దాటి ఒంటరిగా జీవితం గడుపుతున్న పెద్ద వారికి ,తమ పిల్లలు సొంత ఊరు వచ్చి ,తమ దగ్గర ఉంటారంటే ,ఎంత సంతోషమో కదా ! మా అమ్మ ఆ ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నారు.పెద్దవాళ్ళు ఆనందంగా,ఆరోగ్యంగా ఉంటేనే కదండీ ! మనమూ సంతోషంగా ఉండగల్గేది.మా అబ్బాయి ని వదిలి వచ్చినందుకు నాకు కొంచెం బాధ,నేను దగ్గరకొచ్చేసాని అమ్మ కు బోలెడు సంతోషం .చిత్రంగా ఉంది కదండీ !ఇంకొక విషయమండోయ్! పల్లెటూరు కదా ! బోల్డంత స్థలం ఉంది ,ఇకనుండీ ఆ మొక్క పూసింది, ఈ చెట్టు కాసింది, అంటూ ఫోటోలు పెట్టి మిమ్మల్ని విసిగిస్తుంటానులేండి.ప్రస్తుతం మా నివాసం, మా తాత గారి తండ్రి ,95 సంవత్సరాల క్రితం కట్టిన ఇంట్లో .ఆ ఇల్లు అంటే మా కందరికీ చాలా ఇష్టం .ఆ ఇంటికి ఎదరుగానే ఇల్లు  కట్టబోతున్నాము.ఆ పాత ఇంటి ఫోటోలు మీకు తరువాత టపా లో చూపిస్తాను లెండి.