రాష్ట్రపతి భవనం బొల్లారం,సికింద్రాబాద్.

సికింద్రాబాద్ లోని బొల్లారం లో గల రాష్ట్రపతి భవనం చూడటానికి ,సందర్శకులను అనుమతిస్తున్నారన్న వార్త  నిన్న ఈనాడు పేపర్ లో చదివి ,వెళ్ళి చూసిరావాలని అనుకున్నాను .మేముండే సఫిల్ గూడ కు దగ్గరే .7కిలోమీటర్లు.మధ్యాహ్నం భోజనాలు చేసి ,2గంటలకు,ఎదురింటి వారిని కూడా తీసుకుని ,వెళ్ళాము.ఉదయం 10గంటలనుండి సాయంత్రం 5గంటల వరకూ, అనుమతి .జనవరి 6  నుండీ 12 వరకూ తెరచిఉంటుంది .వెళ్దామా అని ,మా వార్ని అడిగితే ,ఆ!పేపర్లో అట్లాగే వ్రాస్తారు,అక్కడికెడితే ఏమీ ఉండదు,అన్నారు. ఏమీ లేకపోయినా కనీసం మొక్కలైనా చూడవచ్చు కదా !అని బయల్దేరాము.పార్కింగ్,ప్రవేశము,రెండూ ఉచితమే.భవనం లోపలికి ప్రవేశం లేదు కానీ ,తలుపులకు అమర్చిన జాలీల ద్వారా ,లోపలికి చూసే వీలు కల్పించారు.ఫోటోలు కూడా తీసుకున్నాము. మేము ఉండగానే మీడియా వారు కూడా సందడి చేసారు.భవనం ఏమంత పెద్దదేం కాదుగానీ ,చుట్టూ తోటలు ,మొక్కలూ,బాగున్నాయి.మొత్తం 90ఎకరాల విస్తీర్ణం.ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి గా ఉన్నసమయంలో ఔషధమొక్కల వనం ప్రారంభించారు .భవనం నిజాములచే నిర్మించబడినది.భవనం లో సొరంగమార్గం కూడా ఉంది .ఏడాదికొకసారి ప్రజలకు సందర్శనకు ,అనుమతించడం కూడా ప్రతిభా పాటిల్  గారి హయాం లోనే మొదలైంది .ఇదంతా ఈనాడు వారిచ్చిన సమాచారం .తిరిగి తిరిగి అలిసిపోతామని,ఉచితంగా మంచినీరు ఏర్పాటు చేసారు .తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అల్పాహారశాల కూడా ఉంది .అవి మాత్రం ఉచితం కాదండోయ్!మరింత సమాచారం కోసం జనవరి7 ఈనాడు దినపత్రిక హైదరాబాద్ జిల్లా ఎడిషన్ మధ్య పేజీ చూడండి .