ఆషాడం -ఆహారం -ఆరోగ్యం

మునగాకు,నేరేడుపండు,గోరింటాకు
             అవునండీ !ఈ మూడింటిని ఆషాడం లో కనీసం ఒక్కసారైనా వాడుకోవాలని ,పెద్దలు చెబుతారు. గోరింటాకు నూరి చేతికి పెట్టుకోవడం ఎటూ అందరికీ ఇష్టమేననుకోండీ !ఇక మిగిలిన రెండింటినీ ,తప్పక తినాలి.
             
పెద్దవాళ్ళు చెప్పారంటే ,అందులో తప్పక ఏదో ఒక ఆరొగ్యసూత్రమ్  తప్పక ఉంటుందని నాఅభిప్రాయం . మంచిదేకదా!అని ఫాలో అయిపోవడమే . అబ్బే !అలా గుడ్డిగా ఫాలోఅవడం కుదరదూ అంటే, మునగాకు ఉపయోగాల్ని గూర్చి ,ఆయుర్వేద నిపుణులు చెప్పిన విషయాలకు, సంబంధించిన  ప్రచురణ జత చేస్తున్నాను, చూడండి .

            మా పెరట్లో మునగచెట్టు ఉంది కాబట్టి నేను ఎక్కువగానే వాడుతుంటాను . కాడలు లేకుండా శుభ్రం చేసి ,కడిగి ,సన్నగా తరిగి ,మెంతికూర లాగా అన్ని కూరల్లొనూ ,వాడుకోవచ్చు .

          తమిళులు బాగా వాడతారు . మాకు ఇద్దరు తమిళ స్నేహితులు ఉన్నారు . ఎంత ఆకు ఇచ్చినా , ఎన్ని సార్లు ఇచ్చినా ,వద్దనే అనరు . అంత ఇష్టం . ఇంకా చాలా మంది అడిగి తీసికెల్తూ ఉంటారు . ఇంకో ముఖ్యమైన సంగతి చెప్పాలి మీకు,అసలు మునగాకును కూర చేసుకుంటారని తెలియని వాళ్ళ  వెంటబడి ,ఈ కటింగ్ చూపించి మరీ ,ఆకును అంటగడుతూ ఉంటాను . తిన్నాక వాళ్ళు బావుందనే చేబుతారులెండి . (చెప్పక చస్తారా మరి!)
ఈ రోజు నేను చపాతి లోకి ఆలు ఉల్లిపాయతో మునగాకు కలిపి కూర చేసాను .  చూడండి .  

                          ఇక నేరేడుపండు విషయానికొస్తే ,మనకు తెలియకుండా ఆహారం ద్వారా మన కడుపు లోకి చేరే వెంట్రుకల్ని కత్తిరించి బైటకు పంపే శక్తి , దానికి ఉంటుందట . అందుకే తప్పక ఒక్కసారైనా తినాలట .
ఇవండీ !ఆషాడం కబుర్లు . కాస్త ఆలస్యమైంది కదండీ ,ఏం పర్వాలేదు ,ఇంకా మూడు రోజులు ఉందండీ మూడింటి కోసం ప్రయత్నించండీ !