రాగిపిండి పిట్టు

ఇది పాతకాలం పిండి వంట.మా చిన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన శుభకార్యాల్లో చేసేవారు .ఇప్పుడు ఎవరూ చేయడం లేదనుకుంటున్నాను.బియ్యప్పిండి తో చేస్తారు గోదావరి జిల్లాల్లో. వేడివేడిగా తింటే చాలా రుచి గా ఉంటుంది .తీపి తక్కువ ,నూనె అసలే ఉండదు కాబట్టి ఆరోగ్యకరమైన వంట అని చెప్పొచ్చు ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్"కదా! నేనేమో బియ్యప్పిండి బదులుగా రాగిపిండి తో ప్రయత్నించాను.బావుంది.మీరూ చేసి చూడండి .instant breakfast . కావాల్సిన పదార్థాలు :రాగిపిండి-1కప్పు.  పచ్చి కొబ్బరితురుము-అరకప్పు.ఉప్పు-చిటికెడు. పంచదార-రెండు చెంచాలు. నెయ్యి_-ఒక చెంచా. నీళ్లు  -రెండు చెంచాలు. । చేసే విధానం: నీళ్ళు తప్ప మిగతా పదార్ధాలన్నీ, ఒక పళ్ళెం లో వేసుకుని వేళ్ళతో కలుపుకోవాలి.కొబ్బరి తడి తోనే చాలా వరకూ కలిసి పోతుంది.తరువాత రెండు చెంచాల నీళ్ళు చల్లి,తడీపొడిగా కలుపుకోవాలి.ముద్దగా అవకూడదు.కడిగి గట్టిగా పిండిన ఇడ్లీరవ్వ మాదిరిగా పొడిపొడిగా ఉండాలి.ఒక వెడల్పాటి గిన్నెలో గ్లాసుడు నీళ్ళు పోసి మరిగించాలి.ఇప్పుడు తడుపుకున్న పిండిని పిండిని పల్చటి గుడ్డ లో పరిచినట్లుగా వేయాలి.ఇపుడు పిండితో పాటుగా గుడ్డను ,ఒక స్టీలు జల్లెడ మీద పెట్టి ,గుడ్డ అంచులతో పిండిని మూసేయాలి.ఇపుడు జల్లెడ  తీసికెళ్ళి మరుగుతున్న నీళ్ళగిన్నె మీద పెట్టి పది నిముషాలు ఉడికిస్తే రాగిపిండి పిట్టు రడీ!పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ,ఏదైనా పండుతో కలిపి తింటే రుచీ+ఆరోగ్యం కూడానూ .చూస్తూంటే ప్రాసెస్ కష్టంగా అన్పిస్తుంది కానీ చేయడం చాలా సులువు.టఫిన్ ఎమీ లేదనుకున్నప్పుడు,వెంటనే చేసేసుకోవచ్చు.మొదలు పెట్టేయండి మరి.