మా దొడ్లో చెట్ల మీద ఎగురుతూ ఉండే పిట్టలు కట్టిన గూడు,పెట్టిన గుడ్లు ,పుట్టిన పిల్లలూ ,అన్నీ చూసారు కదా !ఈవిడకు ఇంకేమీ పని లేదా అనుకోకపోతే ,మీరు కాస్త ఓపిక చేసుకోండి మరి. ఎందుకంటే మళ్ళీ సీరియల్ మొదలయిపోయింది మరి.
ఈసారి లోకషన్ మారిందండీ!ఆ జా తి పిట్టలే . అవేనా కాదా అన్నది చెప్పడం కాస్త కష్టమే ఎందుకంటే అవి అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా!ఈ సారి ఘుమఘుమలాడే కరివేపాకు ఇప్పుడు చెట్టును ఎంచుకున్నయి. ఇప్పుడు వాటిని కగమనించడం చాలా వీలుగా ఉంది . గది లోపలనుంచే కిటికీ లోనుండి చూస్తె ,చక్కగా కన్పిస్తున్నాయి . వాటికి మేము కనబడటం లేదు కాబట్టి వాటి పని అవి హాయిగా చేసుకుంటున్నాయి ,భయం లేకుండా . వాటికి ఇళ్ళు కట్టుకోవడానికి కావలసినంత స్వేచ్చ ,బోలెడన్ని ఆప్షన్స్ ,మనలాగా ఆంక్షలు లేవు ,చక్కగా వాటి ఇష్టం వచ్చ్చినట్లు అవి కట్టుకుంటాయి .
అవి పనిచేసే విధానాన్ని, వేగాన్ని, నైపుణ్యాన్ని, చూసి మనం ఆశ్చర్యపోవాల్సిందే . ఒకే ఒక్క రోజులో గూడు కట్టడం పూర్తి చేసేసాయి . ఉదయాన్నే చూసేసరికి గాలికి ఎగిరి వచ్చిన దూది పింజ చెట్టుకు పట్టినట్లుగా అన్పించిది. కాసేపయ్యాక చూస్తె దూది ఇంకాస్త పెరిగింది . ఇంకాసేపట్లోనే చిన్న గిన్నె లాగా తయారు చేసేసింది . ఇంక అప్పుడు తెల్సిపోయింది ,మళ్ళీ గూడు కట్టేస్తున్నాయని . దూదితొ ఫ్రేమ్ చేయడం అయిపొయింది కదా !ఇక మధ్యాహ్నం నుండి మొదలు ,రెండూ పుల్లలు తేవడం . సన్నని పీచు లాంటి పుల్లలు విసుగు లేకుండా ,తెస్తూనె ఉన్నాయి. తెచ్చిన పుల్లల్ని దూదికి లోపల బయటా పేరుస్తూ , మధ్య మధ్యలో, కరివేపాకును కలుపుతూ ,దారాన్ని కూడా తెచ్చుకొని, మనం సూది తో కుట్టినంత బలంగా కుట్టేసాయి . మధ్యలో అపుడపుడు లోపలి కి దిగి గుండ్రంగా తిరిగింది . బహుశా గూడుకు ఒక ఆకృతి రావడంకోసం కావచ్చు, అనుకున్నాను. గాలికి చెట్టు ఎక్కువగా ఊగితె గూడు పడిపోతుందేమోనని మావారు సపోర్ట్ కోసం కర్ర కూడా భూమిలొ పాతి చెట్టుకు కలిపి కట్టేసారు . కట్టుబడిపూర్తి అయింది ,ఇంకా తుదిమెరుగులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి . ఇక తరువాత గుడ్లు ఎపుడు పెడతాయా అని వేచి చూడాలి . నాతొ పాటు మీరు కూడా!