ఏం చేయాలి?

నాణేనికి బొమ్మ బొరుసు ఎట్లా ఉంటాయో ,అదే విధంగా ప్రతీ విషయం లోను,ప్రతీ వస్తువు లోనూ మంచీ చెడూ  రెండూ  కలిసే ఉంటాయి . సహజంగానే అందరం మంచినే స్వీకరించాలి ,మంచిగానే ఉండాలి అనే అనుకుంటాం ,కానీ ఆచరణ లోకి వచ్చేసరికి కొంచెం కష్టం  .
               ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ,మనం తీసుకొనే ఆహారం విషయమే చూడండి ,ఈ రోజుల్లో మన ఆహారంలో రుచికే మొదటి ప్రాధాన్యం . ఆహార నిపుణులు చెప్పిన విధంగా ఆరోగ్యకరంగా ,వండుదామని ,
ప్రయత్నిస్తే ,తినడానికిఇంట్లో  అందరికీ కష్టమే . అయినా చేస్తూనే ఉంటాననుకోండి .
           ఒక రోజు పేపర్లో రోజుకు 5కప్పుల కాఫీ తాగినా పరవాలేదని ,అధ్యయనాలు రుజువు చేశాయని,  వస్తుంది ,
ఈ ఇంకో నాలుగు రోజులు పోయాక ,కాఫీ ,టీ ,మానేస్తే గుండె జబ్బుల ముప్పు ,సగానికి తగ్గిపోతుందని ,మరొక వార్త.     ఈ రెండింట్లో దేన్నీ అనుసరించాలా ,అని కాస్సేపు ఆలోచన .
        కోడిగుడ్డు లోని పచ్చ సోన తినొద్దని డాక్టర్లు చెబుతారు . ఈ మధ్య ఒక పేపర్లో రోజుకు నాలుగు పచ్చ సోనలు తిన్నా ఏం  పర్వాలేదట . అది చదివి తినడం మొదలు పెట్టామా ,తరువాత వచ్చే సమస్యలకు మనదే భాద్యత .
సాధారణంగా డైటీషియన్లు ఉపాహారం మానవద్దు . తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు . కొన్ని పదుల సంవత్సరాల నుండీ మనం కూడా టిఫిన్ ఉదయాన్నే తినడానికి ,అలవాటు పడ్డాము . అది కూడా ఇడ్లి , దోశ
లాంటివి మంచివి అంటారు . కానీ ఈ మధ్య ఒక ఆయుర్వేద డాక్టర్ గారు వ్రాసిన ప్రకారం ఉదయం టిఫిన్ల రూపం లో మినపప్పు వాడకం ఎక్కువ అయినందు వల్లనే ఇపుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు, ఎక్కువ అవుతున్నాయట . ఉదయాన్నే పెరుగన్నం తింటే మంచిదనీ చెప్పారాయన . అది ఎంతమందికి సహిస్తుంది చెప్పండి?  వేడి వేడి టిఫిన్లకు  అలవాటు పడిపోయిన ప్రాణాలివి .
        ఇట్లా విరుద్ధంగా ఉండే విషయాలు చదివినపుడు ,చాలా తికమకగా ఉండి ,దేన్నీ అనుసరించాలా అని కాస్సేపు ఆలోచించాలి, మనకు లభించే సమయాన్ని బట్టీ ,మన పని వేళలను బట్టీ , మన వయసును ,మన శరీర తత్వాన్ని బట్టి ,మనకు ఏది నప్పుతుందో ,దాన్ని ప్రకారం మనం ఆహారాన్ని తీసుకొంటే , చాలా ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు .
         సౌకర్యాలు ఎక్కువ అయిన ఈరోజుల్లో ,వాటితో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ గానే ఉంటున్నాయి.   ఏం  చేద్దాం? ఏ  విషయం లోనైనా సమతుల్యత పాటించడానికి ప్రయత్నం చేయడమే మనం చేయగలిగినది .
      ,